వంకాయ-చిక్కుడు-అల్లంకారం  :

వంకాయను ఆహారంలో తరచూ తీసుకోవటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్    తగ్గుతుంది.  అలాగే రక్త పోటు అదుపు లో ఉంటుంది.  శరీరంలో ఉండే అధిక ఇనుమును తొలగిస్తుంది.

పందిరి చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.  చిక్కుడు గింజలు తిన్నా కూడా చాల ఆరోగ్యం.  ఈ చిక్కుడు కాయల్ని తినటం వలన డయేరియా, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  ఇవి తినటం వలన ఆకలి బాగా తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని డైట్ లో తీసుకోవచ్చు.

( వీటి విషయంలో ఏవైనా వ్యత్యాసాలుంటే దయచేసి మీమీ వైద్యులని అడగండి.

ఇవి తీసుకోండి :

పావుకిలో వంకాయలు, చిక్కుడు కాయల ( నాలుగు పుంజీల చిక్కుడు, రెండు వంకాయలు)కి చంచాడు నూనె , పసుప చంచాడు రుచికోసం ఉప్పు, చంచాడు పోపుసామాను, ఎండుమిర్చి – 2 రెండు రెబ్బలు కరివేపాకు .

అల్లం కారం కోసం :

పచ్చిమిర్చి – 5, అంగుళం ముక్క అల్లం, జీలకర్ర 1 చంచాడు.

ఇలా చేసుకోవాలి:

  1. ముందుగా అల్లం కారం కోసం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. చిక్కుడు కాయలు, వంకాయలు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
  3. స్టవ్ ఆన్ చేసి కళాయి/ బూర్లమూకుడు పెట్టుకొని 2 చంచాడు నూనె వేసి వేడయ్యాక తాలింపు గింజలు , ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలి .
  4. ముందుగా చిక్కుడు కాయ ముక్కలు వేసి కలుపు కొని మూత పెట్టి మగ్గనివ్వాలి .
  5. చిక్కుడు కాయ ముక్కలు ముప్పావు వంతు వేగిన తరువాత , కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి.
  6. వంకాయ ముక్కలు వేసిన తరువాత 5 నిముషాలు మూత పెట్టి మగ్గ నివ్వాలి .
  7. ఇప్పుడు మూత తీసి పసుపు, ఉప్పు వేసి ముక్కలు వేగిన తరువాత అల్లం కారం కూడా వేసి వేగనివ్వాలి .
  8. అల్లం కారం పచ్చి వాసన పోయే వరకు వేయించి , చివరగా కొత్తిమీర తురుము కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అల్లం వేయకుండా ఉత్తి పోపులో కూడా వేసి చేసుకోవచ్చు. అది వేరే రకం.

ఈ కూర కూడా నా ఒక్కడి కోసమే కాబట్టి ఒక నల్ల వంకాయ ఉంటే అదీ ఒక తెల్ల వంకాయ వాడేను.

Comments

Popular posts from this blog

ఆరోగ్యం- పప్పులు.

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని